Thursday, May 16, 2019

గాంధీ హంతకుడు దేశభక్తుడన్న ప్రగ్యా సింగ్‌

గాంధీ హంతకుడు దేశభక్తుడన్న ప్రగ్యా సింగ్‌
Posted On: Friday,May 17,2019

                      న్యూఢిల్లీ : భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి తరపున పోటీచేస్తున్న ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యల జాబితాలో మరొకటి చేరింది. మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సే ఒక గొప్ప దేశ భక్తుడు అని అమె గురువారం వ్యాఖ్యానించారు. దేశంలో మొదటి ఉగ్రవాది గాడ్సే అంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2008లో జరిగిన మాలేగావ్‌ ఉగ్రవాద పేలుళ్ల కేసులో ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై బిజెపి తరపున పోటీ చేస్తున్న ప్రగ్యా, ఎన్నికల ప్రచారంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముంబై పేలుళ్లలో మృతిచెందిన హేమంత్‌ కర్కరే తన శాపం వల్లే చనిపోయాడని, అయోద్యలోని బాబ్రి మసీదు కూల్చివేతలో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు. దీంతో ప్రగ్యా ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిషేధం కూడా విధించింది. తాజాగా గాడ్సే దేశభక్తుడంటూ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచి సైతం వ్యతిరేకత రావడంతో కొన్ని గంటల్లోనే ప్రగ్యా క్షమాపణ చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను ఉపసంహరించు కున్నారు. ప్రగ్యా తాజా వ్యాఖ్యలపై వాస్తవ నివేదికను శుక్రవారం నాటికి పంపించాలంటూ మధ్యప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ను ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించినట్టు న్యూఢిల్లీ నుంచి అందిన సమాచారం.







 Share

No comments:

Post a Comment