Monday, May 27, 2019

భారత్ ఎలా తప్పుదోవ పట్టింది? Pankaj Mishra

భారత్ ఎలా తప్పుదోవ పట్టింది?
28-05-2019 00:31:44

ప్రతీకార ఉద్వేగాలు, వైభవోపేత అధికారం, ఆధిక్యతల స్వప్నాలతో ఓటర్లను మైమరిపించడం ద్వారా తన సహజ వివేకపు వినాశనాత్మక పర్యవసానాలు ప్రజల నిశిత పరిశీలనలోకి రాకుండా నరేంద్రమోదీ చాలా నేర్పుగా తప్పించుకోగలిగారు. నేడు పలు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్న విద్వేష రాజకీయాలకు 2014లో ఈ హిందూత్వ నేత పథ నిర్దేశం చేశారు. 2019లో సత్యానంతర యుగపు సంచలనాత్మక ఎన్నికల విజయాలలో ఒకదానికి ఆయన సారథ్యం వహించారు. మోదీ జయధ్వానం భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి భయపడక తప్పని అగత్యాన్ని కల్పించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశంపై ఈ ఏడాది ఫిబ్రవరి 26 తెల్ల వారు జామున పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో గల ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు జరిపింది. ఆ ఉదయం భారత్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల వాయుతలం దట్టంగా మేఘావృతమై వున్నది. వైమానిక దాడులకు మేఘాలు విఘాతమవుతాయేమోనని వాయుసేన అధికారులు సంశయిస్తుంటే వారి సంకోచాన్ని తోసిపుచ్చి కర్తవ్య పాలనకు పూనుకోమని స్పష్టం చేశానని 17 వ లోక్ సభ ఎన్నికల ప్రచార తుదిదశలో మోదీ వెల్లడించారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘సైన్స్ గురిచి నాకు ఏమీ తెలీదన్న మాట నిజం. అయితే నా ‘సహజ వివేకాన్ని’ పూర్తిగా విశ్వసించాను. ఆకాశం మేఘావృతమై ఉన్నందున భారతీయ ఫైటర్ జెట్స్ ను పాకిస్థానీ రాడార్ కనుగొనలేదని నా ‘సహజ వివేకం నాకు చెప్పింది’.

ఐదేళ్ళ మోదీ పాలనలో ఆయన ‘సహజ వివేకం’ మూలంగా భారత్ అనేక విధాల నష్ట పోయింది. నానా యాతనలు పడింది. ముఖ్యంగా 2016 నవంబర్‌లో మోదీ ప్రభుత్వం హఠాత్తుగా 90 శాతం కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో అసంఖ్యాక భారతీయులు అకారణంగా అవస్థలపాలయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం కల్గించడం, దక్షిణాసియాను అణు యుద్ధం ముంగిటిలోకి తీసుకువెళ్ళడం మొదలైన వాటితో ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అధిపతి అపాయకరమైన అనర్హుడు అని నరేంద్ర మోదీ రుజువు చేశారు. మోదీ పాలనలో నిరుద్యోగం అపారంగా పెరిగిపోయింది.., జమ్మూ -కశ్మీర్‌లో ఉగ్రవాద హింసాకాండ బాగా పెచ్చరిల్లిపోయింది. గత ఫిబ్రవరిలో పాకిస్థాన్‌పై సంచలనాత్మక వైమానిక దాడుల్లో కొన్ని చెట్లు కూలిపోవడం మినహా ఆ దేశానికి ఏమీ నష్టం సంభవించలేదు. పేద భారతీయులు కొంతమందికి మోదీ పాలన మేలు చేయకపోలేదు. సొంత పాయిఖానా వసతి కల్పించారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్‌ను కలిగివుండేందుకు సహకరించారు. స్వల్ప వడ్డీపై రుణ సదుపాయం, గృహ వసతి, విద్యుత్ సరఫరా, వంటగ్యాస్ సిలిండర్ మొదలైన వాటిని సమకూర్చారు. ఈ సహాయాల గురించి మోదీ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్నది. మహా ఆడంబర పూర్వకంగా ప్రచారం చేసుకున్నది. ఇదిగో, ఆ ప్రచారం నుంచి మోదీ 2019 సార్వత్రక ఎన్నికలలో బాగా లబ్ధి పొందారు. కార్పొరేట్ కంపెనీల నుంచి అందిన భారీ విరాళాలతో ఎన్నికల ప్రచారానికి, ప్రయోజనాలకు బీజేపీ అమితంగా ఖర్చు పెట్ట గలిగింది. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలోని మీడియా మోదీని ‘భారతదేశ సంరక్షకుడు’గా ఓటర్ల మనస్సులో సుప్రతిష్ఠితం చేసింది. ఇంతవరకు ఎటువంటి అభిశంసనకు గురికాని భారత రాజ్యాంగ సంస్థలలో ఎన్నికల సంఘం ఒకటి. అటువంటి సంస్థకూడా ప్రస్తుత ఎన్నికలలో సిగ్గూఎగ్గూ లేకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు చేసిన విమర్శల్లో సహేతుకత ఎంతైనా ఉన్నది.

యువ భారతీయులపై మోదీ ప్రభావం అంతా ఇంతా కాదు. వారిని ఆయన తన వచో నైపుణ్యంతో మంత్రముగ్దుల్ని చేశారు. ‘నైతిక జీవితం తనను తాను సరిదిద్దుకొంటున్న ప్రక్రియను పరిశీలించడం అప్పుడప్పుడు సాధ్యమవుతుందని’ అమెరికన్ సాహిత్య విమర్శకుడు లియోనెల్ ట్రిల్లింగ్ అన్నారు. భారతీయులు తమను తాము భావించుకుంటున్న, ప్రపంచాన్ని చూస్తున్న రీతిని నవీన సాంకేతికతల సహాయంతో పూర్తిగా మార్చి వేయడం, అలాగే సామాజిక పౌర జీవనం (పబ్లిక్ స్పియర్- కలసి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిపై చర్చించి, ఆ చర్చల ద్వారా రాజకీయ కార్యాచరణను ప్రభావితం చేసేందుకై సామాజిక జీవితంలో వ్యక్తులు ఒక్కటిగా కలిసివచ్చే కార్యక్షేత్రం)లో సంప్రదాయ పట్టణ ప్రాంత కులీన వర్గాలపై ప్రజల్లో విశృంఖల ఏహ్య భావాన్ని కల్పించడం ద్వారా మోదీ భారతదేశంలో అటువంటి ప్రక్రియను సృష్టించారు.

భారత్ ఒక అసంబద్ధ అసమానతల సమాజం. భారత రాజ్యాంగమూ, భారత రాజకీయ పక్షాలూ కులమతాలకు అతీతంగా భారతీయులందరూ సమానులేనని ఉద్ఘోషిస్తున్నాయి. విద్యా, ఉద్యోగావకాశాల విషయంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉన్నదని చెబుతున్నాయి. అయితే ఈ సమానత్వ సూత్రాలు ఎంత భయానకంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో అత్యధిక భారతీయుల నిత్య జీవితానుభవాలు నిరూపిస్తున్నాయి. భారతీయులలో అత్యధికులు మానవతా మెరుపుల ప్రజాస్వామిక ఆదర్శాలు, తుచ్ఛ, నీచ అప్రజాస్వామిక యథార్థాల మధ్య బలవంతంగా జీవిస్తున్నారు. వారి మనసు అగాథాల్లో ఆత్మన్యూనతా భావాలు, అసూయా ద్వేషాలు, నానా అవమానాల గాయాలు పేరుకుపోయివున్నాయి; ఒక కఠోర సామాజిక క్రమానుగత శ్రేణి (హిందూ వర్ణ వ్యవస్థకు మించిన ఉదాహరణ దీనికి మరొకటి ఏముంటుంది?)లో ఉన్నతస్థాయిలో ఉన్నవారి నుంచి ఎదురయిన అవమానాలు, అపజయాల నుంచే అవి అసంఖ్యాక భారతీయుల మనస్సుల్లో నిక్షిప్తమయ్యాయి.

ఈ ప్రమాదకర ఉద్రిక్తతలను, 1980వ దశకం తుదినాళ్ళలో ఒక ప్రాంతీయ విశ్వవిద్యాలయ విద్యార్థిగా నేను ప్రత్యక్షంగా చూశాను, అనుభవించాను. విద్యా విషయిక ప్రతిభాపాటవాలలోనూ, సాంస్కృతిక రీతులు, ఆలోచనా ధోరణులలోనూ మెట్రో పాలిటన్ ఆంగ్ల విద్యాధికులకు దీటుగా భాసిల్లాలని మేము ఆరాటపడేవాళ్ళం. నరేంద్ర మోదీ ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఎంతో అనుచితంగా మాట్లాడిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మా ఆగ్రహానికి లక్ష్యంగా ఉండేవారు.
వలసపాలన ముగిసిన అనంతరం ఆధునిక పాశ్చాత్య ప్రపంచస్థాయికి భారత్‌ను తీసుకువెళ్ళే బాధ్యతలు చేపట్టిన, అయితే వాస్తవానికి తమ సొంత ప్రయోజనాల పరిరక్షణకు మాత్రమే ప్రాధాన్యమిచ్చిన కుహనా సామ్యవాద కులీన వర్గానికి ప్రతినిధి రాజీవ్ గాంధీ. ఈ ఆంగ్ల విద్యాధిక మెట్రోపాలిటన్ పాలక వర్గం మమ్ములను చరిత్రలో ఒక నిస్సహాయ స్థితిలో వదిలివేసి, తాము మాత్రం సంపన్న పాశ్చాత్య ప్రపంచం సరసన ఉండడానికి ఆరాటపడింది. జాతి సర్వతో ముఖాభివృద్ధికి బాధ్యత వహించాల్సిన ఆ కులీన వర్గం తమను నిర్లక్ష్యం చేయడం అసంఖ్యాక భారతీయులకు తీవ్ర మనస్తాపం కల్గించింది. ముఖ్యంగా 1990 వ దశకంలో ప్రపంచీకరణ విధానాలను అనుసరించడం మొదలయిన తరువాత ఈ మనస్తాపం మరింత అధికమయింది. అమెరికన్ వ్యష్టి వాద ధోరణులు పెరిగిపోవడమూ, పల్లెల నుంచి పట్టణాలకు వలసలు ముమ్మరమవ్వడమూ మొదలైన పరిణామాలు కూడా ఆ మానసిక గాయాలను మరింత తీవ్రంచేశాయి. వ్యక్తిగత సంపద, వినియోగం గురించి టీవీ, ఇంటర్నెట్‌లు ప్రజలను అనూహ్యరీతుల్లో ప్రభావితం చేశాయి.

సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిన స్వతంత్ర భారత పాలకులకు వ్యతిరేకంగా అత్యధిక భారతీయులలో గుప్తంగా నెలకొన్న ఆగ్రహాన్ని, సామాజిక ఊర్థ్వ గమనానికి తీవ్ర అవరోధాలుగా ఉన్న శక్తులపై నెలకొన్న తీవ్ర అసంతృప్తిని తమ రాజకీయ లక్ష్యాలకు ఉపయోగించుకునేందుకు జాతీయ రాజకీయాలలోకి నరేంద్ర మోదీ ప్రవేశించేంతవరకు -ఏ రాజకీయ వేత్తా ప్రయత్నించనే లేదు. 2002 గుజరాత్ మారణకాండకు నరేంద్రమోదీయే కారకుడని ఆంగ్ల విద్యాధికులు, పాశ్చాత్య ప్రభుత్వాలు తీవ్రంగా నిందించాయి. అమాయకుల ఊచకోతలు జరుగుతున్నా మోదీ ఉదాసీనంగా వ్యహరించారని, అసలు ఆయనే ఆ హత్యాకాండను స్వయంగా పర్యవేక్షించారని కూడా ఆయన్ని విమర్శించాయి. భారతదేశపు కుబేరులు కొంతమంది సహాయ సహకారాలతో నరేంద్ర మోదీ ఈ కళంకం నుంచి బయటపడి 2014 సార్వత్రక ఎన్నికల నాటికి జాతీయ స్రవంతి రాజకీయాలలోకి ప్రవేశించారు. తన సభికులలో అత్యధికంగా ఉండే అణగారిన వర్గాల వారిలో తానూ ఒకడినని మోదీ మొదటి నుంచీ చెప్పేవారు. స్వయం శక్తితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని, ఈ క్రమంలో వంచకులు అయిన ముస్లింలను బుజ్జగిస్తూ తన లాంటి ఉత్తమ హిందువులను అన్ని విధాల అణచివేసేందుకు ప్రయత్నించిన వారిని అధిగమించేందుకు తాను ఎలా కష్టపడిందీ మోదీ వివరించేవారు. భారత్‌ను ఒక గొప్ప అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్ది, హిందువులను మళ్ళీ చరిత్ర పురోగమన ప్రస్థానంలో అగ్రగాములుగా నిలబెడతానని మోదీ వాగ్దానం చేసేవారు.

మోదీ ఐదేళ్ళ పాలనలో భారతీయ నెటిజన్ల సంఖ్య రెట్టింపయింది. నిరుపేద చేతిలోకూడా స్మార్ట్ ఫోన్ కన్పించడం సాధారణమై పోయింది. ఫేస్ బుక్, ట్విటర్, యూ ట్యూబ్, వాట్సాప్ మొదలైన అధునాతన కమ్యూనికేషన్ సదుపాయాలతో ఫేక్ న్యూస్ విస్తృత స్థాయిలో అత్యధికులకు చేరడమూ సాధారణమైపోయింది. ఈ పరిణామం విశేషంగా లబ్ధిని సమకూర్చింది. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల్లో వందలాది పాకిస్థానీయులు హతమయ్యారన్న నకిలీ వార్త ఒకటి అసంఖ్యాక భారతీయ ఓటర్లను ప్రభావితం చేసి ఇటీవలి ఎన్నికలలో మోదీ విజయానికి ఎంతైనా తోడ్పడింది.

భారత్‌లోనూ, పాశ్చాత్య దేశాలలోను ఎంతో మంది నయా ఉదారవాద వ్యాఖ్యాతలు ఆశిస్తున్నట్టుగా అశేష భారతీయులలో తాను ఉత్పన్నం చేసిన భావోద్వేగాలను బ్రహ్మాండమైన ఆర్థిక పురోగతికి తోడ్పడేవిగా మోదీ మార్చడం లేదు. ఆగ్రహపూరితులైన మనుషుల గురించి జర్మన్ తాత్వికుడు నీషే అన్నట్టు గూడుకట్టుకుపోయిన అధోస్థాయి ప్రతీకార వాంఛ అడ్డూ ఆపూ లేకుండా బద్దలవడానికి మాత్రమే దోహదం చేస్తున్నారు. కరడుగట్టిన మితవాదుల లక్ష్యమే మోదీ ఔదలదాల్చిన లక్ష్యం: మైనారిటీ వర్గాలు, శరణార్ధులు, వామపక్షీయులు, ఉదారవాదులు మొదలైన ప్రగతిశీలురను బలిపశువులు చేస్తూ ఆగ్రహపూరితులైన ప్రజలను ఉత్సాహపరచడం, అదే సమయంలో పీక్కుతినే అధునాతన పెట్టుబడిదారీ విధానం సత్వర పురోగతికి తోడ్పడమూ, నిరుద్యోగులైన అసంఖ్యాక యువ భారతీయులకు అవసరమైన కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో మోదీ విఫలమైనప్పటికీ ఆంగ్ల విద్యాధికులతో కఠోరంగా మాట్లాడేందుకు, సమాజంలో ఇప్పటికే ఉన్నత స్థితిలో ఉన్నవారిని తీవ్రంగా వ్యతిరేకించేందుకు అనుమతించారు. ఆంగ్ల విద్యాధికుల పట్ల మోదీలో ఉన్న తీవ్ర వ్యతిరేకత కూడా ఆయన్ని ఈ ధోరణికి పురిగొల్పిందని మరి చెప్పనవసరం లేదు. అశేష అణగారిన భారతీయులను నానా అన్యాయాలనుంచి విముక్తం చేయడానికి బదులుగా వారిలోని నిరాశామయ భావోద్వేగాలకు ఆయన విముక్తి కల్పించారు. మోసపూరిత పాకిస్థానీయులు, భారతీయ ముస్లింలు, ఈ ‘జాతి వ్యతిరేకులను’ బుజ్జగించే భారతీయులను ద్వేషించేందుకు తన మద్దతుదారులను మోదీ స్పష్టంగా పురిగొల్పారు.

ప్రతీకార ఉద్వేగాలు, వైభవోపేత అధికారం, ఆధిక్యతల స్వప్నాలతో ఓటర్లను మైమరిపించడం ద్వారా తన సహజ వివేకపు వినాశనాత్మక పర్యవసానాలు- ఇవి, మరే ఇతర రాజకీయవేత్తనైనా విధిగా పతనమొందించేవనడంలో సందేహం లేదు.- ప్రజల నిశిత పరిశీలనలోకి రాకుండా నరేంద్రమోదీ చాలా నేర్పుగా తప్పించుకోగలిగారు. నేడు పలు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్న విద్వేష రాజకీయాలకు 2014లో ఈ హిందూత్వ నేత పథ నిర్దేశం చేశారు. 2019లో సత్యానంతర యుగపు సంచలనాత్మక ఎన్నికల విజయాలలో ఒకదానికి ఆయన సారథ్యం వహించారు. అయితే మోదీ జయధ్వానం భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి భయపడక తప్పని అగత్యాన్ని కల్పించింది.
 పంకజ్‌ మిశ్రా
(న్యూయార్క్ టైమ్స్) 

No comments:

Post a Comment