Thursday, May 16, 2019

నేను చెప్పింది చారిత్రక సత్యం - Kamal Hasan

నేను చెప్పింది చారిత్రక సత్యం
Posted On: Friday,May 17,2019

- నా వ్యాఖ్యలకు కట్టుబడివున్నా
- హిందూ తొలి ఉగ్రవాది వ్యాఖ్యలపై కమల్‌హాసన్‌
                           చెన్నై : స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందువైన గాడ్సేనంటూ వ్యాఖ్యానించిన విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయిమ్‌ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ తన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సేపై తాను కేవలం చారిత్రక సత్యాన్ని మాత్రమే చెప్పానన్నారు. 'అరవకురిచ్చిలో నేను చేసిన వ్యాఖ్యలు వారికి ఆగ్రహం కలిగించవచ్చు. కానీ, ఎవరినో వివాదంలోకి దించేందుకు, కొందరిని మభ్యపెట్టేందుకు నేను ఈ వ్యాఖ్యలుచేయలేదు. చారిత్రక వాస్తవాన్ని మాత్రమే చెప్పాను' అని కమల్‌ హాసన్‌ అన్నారు. తమిళనాడు తిరుపురన్‌ కుండ్రమ్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఎక్స్‌ట్రీమిస్ట్‌ అన్న పదాన్ని అర్థంచేసుకోండి. గాడ్సేకు వ్యతిరేకంగా తాను టెర్రరిస్టు, హంతకుడు అన్నపదాలను వాడలేదు. సాధారణంగా రాజకీయాల్లో వాడుకలో వున్న 'ఎక్స్‌ట్రీమిస్ట్‌' అన్నపదాన్ని వాడాను. 'హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించానని వారు చెబుతున్నారు. నా కుటుంబంలో అనేక మంది హిందువులు న్నారు. నా కుమార్తె కూడా హిందువే' అని కమల్‌ చెప్పారు. కమల్‌హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వాహనంపై నుంచి కమల్‌ హాసన్‌ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసరటంతో గందరగోళం నెలకొన్నది. ఈ ఘటన తిరుప్పరన్‌కుంద్రమ్‌ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో బుధవారం చోటుచేసుకొన్నది. ఈ దాడి నుంచి కమల్‌ తృటిలో తప్పించుకోగా, చెప్పు ప్రజలపై పడింది. చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడి ఘటనను పలు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఖండించారు. ఇటీవల కమల్‌ హాసన్‌ హిందూ టెర్రరిస్టు అనే వ్యాఖ్యల నేపథ్యంలోనే దాడి జరిగిందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
కమల్‌హాసన్‌పైకి గుడ్లు, రాళ్లు
అరవకురుచి : కమల్‌హాసన్‌ అరవకురుచి సభలో గురువారం ప్రసంగిస్తుండగా, కొందరు వ్యక్తులు గుడ్లు, రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు

No comments:

Post a Comment